Introduction

మా గురించి :
 
                   2014 జూన్‌ 2న దేశంలో 29వ రాష్ట్రంగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్ర విభజనకు కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకొని అప్పాయింటెడ్‌ డేను ప్రకటించిన అనంతరం ఏప్రిల్‌ 13న హైదరాబాద్‌లో నిర్వహించిన UTF రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తెలంగాణలోని 10 జిల్లాలకు చెందిన 43మంది కార్యవర్గ సభ్యులతో TSUTF రాష్ట్ర కమిటీ ఏర్పాటైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ అడ్డుగోడలను బద్దలుకొట్టి, మేనేజిమెంట్‌ అంతరాలను అధిగమించి, క్యాడర్ల బ్యారికేడ్లను ఛేదించి 1974 ఆగస్ట్‌ 10న ఒక చారిత్రక అవసరంగా APUTF విర్భవించింది. 1975 జనవరి 11,12 తేదీలలో ఖాజీపేటలో విద్యాసదస్సు నిర్వహించి తెలంగాణ ప్రాంతానికి విస్తరించింది. 4 దశాబ్దాల ప్రస్థానంలో 1977లో రాష్ట్ర ద్వితీయ మహాసభలను ఖమ్మంలో, 2003లో 9వ మహాసభలను హైదరాబాద్‌లో, 2009లో 11వ మహాసభలను నల్లగొండలో నిర్వహించుకున్నాము. అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ లక్ష్యాలతో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి సామాజిక అభ్యున్నతికి సూత్ర బద్ధవైఖరితో ఎన్నో ఉద్యమాలను పోరాటాలను నిర్వహించి అద్భుత ఫలితాలను సాధించి ఉపాధ్యాయులకు అండగా నిలిచిన UTF విశేష ఆదరాభిమానాలతో రాష్ట్రంలో మేటి సంఘంగా ఎదిగింది. UTF ఆశయబలం, ఉద్యమ స్ఫూర్తి వారసత్వంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (TSUTF) తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. నూతన నిబంధనావళిని రూపొందించుకొని మండలం నుండి రాష్ట్రస్థాయి వరకు ప్రథమ మహాసభలను నిర్వహించి నూతన కమిటీలను ఏర్పాటు చేసుకున్నది. ఫెడరేషన్‌ అధికార వాణిగా ''వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణ టీచర్‌'' మాసపత్రిక 2014 అక్టోబర్‌లో ప్రారంభమైంది. నవంబర్‌ నుండి తెలంగాణ రాష్ట్రంలోని ఐక్య ఉపాధ్యాయ చందాదారులందరికీ ఐక్య ఉపాధ్యాయ స్థానంలో వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణ టీచర్‌ అందజేయబడుతున్నది. నవ తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులందరికీ సమానమైన, నాణ్యమైన విద్య అందించటంకోసం ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో నెలకొన్న అవిశ్వాసాన్ని తొలగించాలని టిఎస్‌యుటిఎఫ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది. ఉపాధ్యాయులు పని సంస్కృతిని పెంపొందించుకొని పాఠశాలల్లో గల సౌకర్యాలను వినియోగించుకొంటూ నాణ్యమైన విద్య అందించాలని, అదనపు సౌకర్యాల కోసం, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికోసం నిర్వహించే ఉద్యమాలలో సామాజిక బాధ్యతతో పాల్గొనాలని సూచిస్తున్నది. ఉపాధ్యాయుల వృత్తినైపుణ్యం మెరుగుదలకు శిక్షణా కార్యక్రమాలను, వర్క్‌షాపులను నిర్వహించడద్వారా తనవంతు కృషి చేస్తుంది. అఖిలభారత ఉపాధ్యాయ ఉద్యమ వేదిక ''భారత పాఠశాల ఉపాధ్యాయుల సమాఖ్య (STFI)కి అనుబంధ సంఘంగా ఉండి విద్యారంగంలో లౌకిక ప్రజాస్వామిక విలువల పరిరక్షణ కోసం, విద్య కార్పోరేటీకరణ, వ్యాపారీకరణలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న దేశవ్యాప్త పోరాటాలలో పాలుపంచుకుంటున్నది. రాష్ట్ర విద్యారంగంలో గురుకుల, మోడల్‌ స్కూల్‌, కెజిబివి తదితర ప్రత్యేక యాజమాన్య విద్యా సంస్థలలోని ఉపాధ్యాయులను సంఘటిత పరచి టిఎస్‌యుటిఎఫ్‌కు అనుబంధంగా సంఘాలను ఏర్పాటు చేసి ఆయా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నది.