నాశనమౌతున్న విద్య

          విద్యా రంగంలోని ప్రధాన స్థానాలలో మిడిమిడి జ్ఞానమున్న విశ్వాసపాత్రులను ఎన్‌డిఏ ప్రభుత్వం నియమించటం ఆందోళన కలిగించే విషయం. దీనితో విద్యావ్యవస్థ దెబ్బతింటున్నది. అయితే ఇదొక్కటే విద్యా వ్యవస్థకు ప్రమాదకారి కాదు. పెట్టుబడిదారీ ప్రపంచీకరణ తనతోపాటు విద్యారంగాన్ని నాశనంచేసే ప్రక్రియను మోసుకొచ్చింది. భారతదేశానికి సంబంధించినంతవరకు విద్యా రంగంలో మతతత్వ ఫాసిజం చొరబాటు ఒక ప్రధానమైన అదనపు అంశం. 'విద్య'ను లాభం కోసం సరుకుగా అమ్మే ప్రయివేటు సంస్థలు తాము లాభం కోసమే పనిచేయమని, ఎందుకంటే మిగిలినదంతా తిరిగి సంస్థ అభివృద్ధికే వినియోగిస్తామనీ చెబుతాయి. కానీ పెట్టుబడిదారీ కంపెనీలు కూడా తమ లాభాలను తిరిగి తమ సంస్థల అభివృద్ధికే వినియోగిస్తాయి. అయినప్పటికీ వాటిని లాభాలు గడించే సంస్థలుగా పిలవటానికి అడ్డేమీలేదు. కాబట్టి లాభాలను తిరిగి ఖర్చుపెట్టడంలో పెద్ద సుగుణమేమీ లేదు. తిరిగి వ్యయం చేసినా, చేయకపోయినా లాభాలు లాభాలే. లాభాలు గడించే సంస్థలు లాభాపేక్షగలవే. తమ లాభాలను తిరిగి తమ కోసమే ఖర్చుపెట్టినంత మాత్రాన వాటిని లాభాపేక్ష లేనివిగా భావించజాలం.
విద్య సరుకీకరింపబడితే పేదలు చదువుకు దూరమవుతారనే అంతర్భావాన్ని చాలా బాగా అర్థ చేసుకోవటం, బాగా చర్చించటం జరిగింది. ధనవంతులు కానివారు కూడా బ్యాంకుల నుంచి రుణాలు పొంది చదువుకోవచ్చని నయా ఉదారవాద సమర్థకులు సూచిస్తారు. అయితే ఉద్యోగం వస్తుందనే నమ్మకంలేని సమాజంలో గత పదిహేను సంవత్సరాలుగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లుగా, అప్పుచేసి చదువుకోవటం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవటానికి దారితీస్తోంది. అప్పు తీర్చవలసిన సమయంలో తీర్చటానికి తగినంత వనరులు లేక పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు రుణం తీసుకొని చదవడానికి కాబట్టి లాభాలను గడించే ప్రయివేటు విద్యా సంస్థలు అమ్మే సరుకీకరింపబడిన విద్య భారతదేశంలో అత్యధిక శాతం విద్యార్థులకు అందుబాటులో వుండదు. వీరందరూ ధనికులుకాని కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవారే. అయితే దీనికి విస్మరించలేని మరో రెండు అంతఃస్సూచికలున్నాయి. వీటిలో నాణ్యత నాశనమవటం ఒకటి. సాధారణంగా విద్య ఒక వ్యక్తిలోకి నివిష్టం(ఇన్‌పుట్‌)గా ప్రవేశించి జనింపజేసే విద్యా ఉత్పాదకం సరుకుగా మారినప్పుడు విద్య సరుకవుతుంది. అయితే విద్యావంతులు చాలా కాలం ఉద్యోగం కోసం 'ఉద్యోగ విపణి'లో వుంటారు. కాబట్టి 'విద్యావంతులు' చాలా కాలం సరుకులుగా మారతారని, ఇప్పుడు జరుగుతున్నదానిలో కొత్తేమీలేదని అనుకోవచ్చు. కానీ ఇది నిజం కాదు. సరుకు అమ్మేవారికి ఉపయోగితా విలువగా కాక మారకపు విలువగా వుంటుంది. అంటే కొంత డబ్బుతోగానీ, కొన్ని సరుకుల విలువకుగానీ సమానంగా వుంటుంది. వ్యక్తిలోకి ఒక నివిష్టంగా విద్య ప్రవేశించినప్పుడు సరుకుగా మారినట్లయితే ఆ వ్యక్తి విద్యను ఉపయోగితా విలువగా కాకుండా మారకపు విలువగా చూస్తాడు. అంటే మార్కెట్‌లో ఎంతోకొంత డబ్బును సంపాదించటానికి కావలసిన సమర్థతను తనకు అందించిన దానిగా విద్యను భావిస్తాడు. విద్య సరుకీకరణ చెందటం వెనుక కొంతకాలంగా ఇదే జరుగుతున్నది.
సృజానాత్మక భావ చింతనను సరుకీకరణ నాశనం చేస్తుంది
క్లుప్తంగా చెప్పాలంటే విద్య సరుకీరింపబడినప్పుడు విద్యార్థులలో జిజ్ఞాస పెంచటం, ఆలోచనా ప్రపంచాన్ని పరిచయం చేసి వారిని ఉత్తేజపరచటంవంటి పాత్రను అది నిర్వహించజాలదు. ఉద్యోగ విపణిలో మంచి విలువను పొందటానికి అనివార్యంగా ఆకళింపుచేసుకోవలసిన గుళికగా విద్యార్థులు విద్యను చూస్తారు. సరుకీకరింపబడిన విద్య విద్యార్థులలో సృజనను, మౌలికత(ఒరిజినాలిటి)ను నాశనం చేస్తుంది. వున్నదానిని దాటిపోవాలనే కోరికను చంపుతుంది. వున్నదానిని దాటిపోవటమే సృజనాత్మక భావ చింతన లక్షణమైనప్పుడు సరుకీకరింపబడిన విద్య సృజనాత్మక భావ చింతనను నాశనం చేస్తుంది. ఆశ్చర్యకరంగా సంప్రదాయ పెట్టుబడిదారీ దేశాలకంటే, సామ్రాజ్యవాద దేశాలకంటే భారతదేశంవంటి 'నూతనంగా ఆవిర్భవిస్తున్న' దేశాలలో అలాంటి సరుకీకరణ ఉగ్రవేగంగా జరుగుతోంది. ఈ దేశాలలో పట్టణ మధ్యతరగతి ఆక్రామకంగాను, సామాజికంగా ఎగబాకేదిగాను, రాజకీయంగా పలుకుబడిగలదిగాను వుండటం దీనికి కొంతవరకు కారణం. అంతేకాకుండా ఈ దేశాలు ఏమీ రాయని పలకలా వున్నాయి. ఆ పలకపై నూతన 'లక్షణాలను' చాలా తేలిగ్గా రాయొచ్చు. సరుకీకరింపబడిన విద్యకుగల మరో అంతఃస్సూచిక ఏమంటే అది తన ఉత్పాదితాలలో అంటే 'విద్యావంతులలో' సామాజిక సున్నితత్వాన్ని లేకుండా చేస్తుంది. వారిని కష్టజీవులపట్ల సానుభూతిలేని స్వార్థపరులుగా మారుస్తుంది. వేలాది సంవత్సరాలుగా అసమానతలు వ్యవస్థీకృతమై, పుట్టుకతోనే కష్టజీవులను 'చిన్నచూపుచూడటం' అలవాటుగామారే కులపరమైన అణచివేతకు ఆలవాలమైన మనలాంటి సమాజంలోని 'విద్యావంతులకు' ఈ లక్షణం తేలిగ్గా వస్తుంది.
విద్య సరుకీకరణకు చెందిన ఈ లక్షణాలన్నీ సమకాలీన పెట్టుబడిదారీ వ్యవస్థకు కూడా అనుకూలంగానే ఉన్నాయి. రైతులను, చిన్న ఉత్పత్తిదారులను స్థానభ్రంశం చేయటం, వారి భూములను లాక్కోవటం, నిరుద్యోగం, తగినంత పనిలేకపోవటం, ప్రచ్చన్న నిరుద్యోగం, రోజు కూలి ప్రభావంతో కేవలం కొద్దిమంది మాత్రమేగల 'సంఘటిత రంగ కార్మికులు' ఇంకా 'లేబర్‌ మార్కెట్‌ సరళీకరణ'కు గురవనప్పటికీ ఈ దురన్యాయాన్ని ప్రతిఘటించవలసినంత ప్రతిఘటించలేకపోవటానికి కారణం సామాజిక సున్నితత్వంలేని, గొంతు పెగలని మద్యతరగతి విద్యావంతుల మద్దతు కొరవడటమే(అనివార్యమే కాకుండా, కమ్ముకొస్తున్న సంక్షోభం మధ్య తరగతిని ఆవహించినప్పుడు ఈ సున్నితత్వలేమి తప్పకుండా మారుతుంది. అయితే ఇది జరిగినప్పటికీ విద్య సరుకీకరణ ప్రతిఘటనను నీరుగార్చే దిశగా పనిచేస్తూనే వుంటుంది). కానీ, నేటి సంక్షోభశకంలో మేథోపరమైన ప్రతిఘటనను నీరుగార్చటంద్వారా సరుకీకరింపబడిన విద్య నయాఉదారవాద ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తున్నప్పటికీ కష్టజీవుల ప్రతిఘటన రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ ప్రతిఘటన ఎదుర్కోవటానికి ప్రపంచీకరింపబడిన కార్పొరేట్‌-ఫైనాన్షియల్‌ బూర్జువా వర్గానికి 'మతతత్వ ఫాసిజం'తో జతకట్టవలసిన అవసరం ఏర్పడింది. క్లుప్తంగా చెప్పాలంటే విద్య సరుకీకరణ చెందటం, విద్య మతతత్వీకరణకు గురికావటం అనే రెండు మార్గాలలో విద్య నాశనమౌతోంది. పాలనారంగంలో కొనసాగుతున్న కార్పొరేట్‌- మతతత్వ మైత్రి ప్రతిరూపమే విద్యా రంగంలో సహజీవనం చేసున్న ఈ రెండు ధోరణులు. ఈ రెండు ధోరణులైన సరుకీకరణ, 'మతతత్వీకరణ'ల మధ్య ఎలాంటి వైరుధ్యమూ లేదు.
చూసీచూడగానే ఇది వింతగా కనిపించవచ్చు. ఉన్నత విద్యను పునరుద్దరించవలసిన ఆవశ్యకతగల 'జ్ఞాన ఆర్థిక వ్యవస్థ(నాలెడ్జ్‌ ఎకానమి)'లో అందరూ అనుకుంటున్నట్లుగా మనం లేమా? 'జ్ఞానాన్ని ఆర్జించేవారి' మెదళ్ళలో హిందూత్వ గులకరాళ్ళను వుంచుతున్నప్పుడు, పురాణాలకు, చరిత్రకు మధ్య తేడాను చెరుపుతున్నప్పుడు, పేదల, అణగారిన ప్రజలపట్ల ద్వేషభావాన్ని పెంపొందిస్తున్నప్పుడు కచ్చితంగా అలాంటిపునరుద్దరణ జరగటం సాధ్యపడదు. కనీసం కార్పొరేట్‌ పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాల కోసమైనా హిందూత్వ శక్తులకు కళ్ళెంవేసి, విద్య 'మతతత్వీకరింపబడటాన్ని' ఆపాలి.
జ్ఞానం, ప్రావీణ్యతల మధ్య తేడా
అయితే 'జ్ఞాన ఆర్థిక వ్యవస్థ' గురించి చేసే వాదనలో 'జ్ఞానం', 'ప్రావీణ్యత' మధ్యగల తేడాను విస్మరించటం జరుగుతోంది. ఆలోచనా ప్రపంచంతో విమర్శనాత్మకంగా వ్యవహరించటంవల్ల ఏర్పడే 'జ్ఞానాన్ని' కార్పొరేట్‌ పెట్టుబడి మనలాంటి దేశాల్లో కోరుకోవటం లేదు. అలాంటి జ్ఞానం అందుబాటులో లేకపోతే ప్రాకృతిక శాస్త్రాలలో జరిగే మౌలిక పరిశోధన దెబ్బతింటుంది. కానీ మనం అలాంటి పరిశోధనల ఫలితంగా అందుబాటులోకి వచ్చే ఉత్పాదనలను అభివృద్ధి చెందిన దేశాలనుంచి దిగుమతి చేసుకోవచ్చు. దేశంలోని కార్పొరేట్‌ పెట్టుబడిదారీ వర్గం కానీ, సామ్రాజ్యవాదం కానీ దేశంలో మౌలిక పరిశోధనలను ప్రోత్సహించా లని అనుకోవటం లేదు. మొదటిది అలాంటి పరిశోధన అవసరం లేదని అనుకుంటుంది. (అలాంటి పరిశోధన పలితాలను అభివృద్ధి దేశాలనుంచి దిగుమతి చేసుకోవటమే దానికిష్టం). రెండవదైన సామ్రాజ్యవాదానికి అభివృద్ధి చెందిన దేశాల మేథో ఆధిపత్యాన్ని, దానిమీద ఆధారపడే మనలాంటి దేశాల మేథోపరాన్నజీవనాన్ని కొనసాగించటమే ఇష్టంగా వుంటుంది. సామాజిక, మానవీయ శాస్త్రాలకు సంబంధించినంతవరకు ఆలోచనా ప్రపంచంతో విమర్శనాత్మకంగా వ్యవహరించటంవల్ల ఏర్పడే 'జ్ఞానం' ప్రమాదకరమైనదిగా కార్పొరేట్‌-మతతత్వ శక్తులు భావిస్తాయి. ఎందుకంటే అలాంటి జ్ఞానం మార్క్సిస్టు, అంబేద్కరైట్‌, ప్రగతిశీల జాతీయవాద, లౌకిక ప్రజాస్వామిక, స్త్రీ విమోచక భావాలను జనింపజేస్తుంది. ఇవన్నీ కార్పొరేట్‌ పెట్టుబడిదారుల, హిందూ మతతత్వ శక్తుల 'ఎర్ర భయం'లో భాగం(కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వశాఖ మెప్పు పొందటానికి చెన్నై ఐఐటిలో అంబేద్కర్‌-పెరియార్‌ స్టడీ సర్కిల్‌ను నిషేదించటానికి చేసిన ప్రయత్నం ఆసక్తిదాయకమైనది. ఈ స్టడీ సర్కిల్‌ను కొందరు 'ఎర్ర సంస్థ'గా వర్ణించారు).
కార్పొరేట్‌ పెట్టుబడికి జ్ఞానం కంటే 'ప్రావీణ్యతలు' అవసరం. అవి చౌకగా లభించాలి. అంతర్జాతీయ పెట్టుబడికి మనలాంటి దేశంలో 'ప్రావీణ్యతగల సిబ్బంది' కావాలి. ఈ సిబ్బంది తక్కువ వేతనాలను తీసుకుంటూ పెట్టుబడి లాభాలను మరింతగా పెంచుతారు. వీరు తీసుకునే వేతనాలు వీరు చేసేపనికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలోని సిబ్బందికి చెల్లించే వేతనాలు చాలా ఎక్కువగా వుంటాయి. అయితే 'జ్ఞాన ఆర్థిక వ్యవస్థ ఆవిర్బావం' అనే పదజాలాన్ని వాడుతున్నప్పటికీ విద్యా సంస్థలను నిర్మించి వాటిలో విద్యనభ్యసించే విద్యార్థులచేత ఆలోచనా ప్రపంచంతో విమర్శనాత్మకంగా వ్యవహరించేలా చేసి 'జ్ఞానాన్ని' అభివృద్ధి చేయటం అనే అర్థంలో ఆహ్వానించదగినది కాదు.
విద్యారంగంపై ఎన్‌డిఏ ప్రభత్వం తయారుచేసిన ప్రతి డాక్యుమెంటూ ప్రయివేటీకరణ, పబ్లిక్‌-ప్రయివేటు భాగస్వామ్యం' ఆవశ్యకతను నొక్కిచెప్పింది. ఎందుకంటే విద్య మతతత్వీకరణకు విద్య ప్రయివేటీకరణ బాగా వుపయోగపడుతుంది. ఇక్కడ మరో విషయం వున్నది. 'ఆర్థిక కారణాలను' సాకుగా చూపించే ప్రభుత్వ రంగం, ప్రయివేటు రంగంలో ఎటూ లాభార్జనే ప్రధాన ధ్యేయంగా వుంటుందిగనుక నామమాత్రపు వేతనాలతో విపరీతంగా పనిచేసే తాత్కాలిక లేక 'గెస్ట్‌' ఉపాధ్యాయులను నియమించే ధోరణి వున్నది. క్లుప్తంగా చెప్పాలంటే ఉపాధ్యాయులలో ద్వంద్వ ధోరణి వుంటుంది. ఒకవైపు మంచి వేతనాలు పొదుతున్న ప్రొఫెసర్లుంటే, మరోవైపు నామమాత్రపు వేతనాలతో బ్రతుకులు ఈడుస్తున్న అధ్యాపకు లుంటారు. ఇది కూడా కార్పొరేట్‌-మతతత్వ శక్తుల ఐక్య సంఘట నకు అనువుగా వుంటుంది. బాగా వేతనాలు లభిస్తూ, మంచి హోదాగల ప్రొఫెసర్లు వాటిని కోల్పోతామనే భయంతో ప్రభుత్వాన్ని విమర్శనాత్మక దృష్టితో చూడటానికి జంకుతారు. అలాగే ఎక్కువ పనిచేస్తూ తక్కువ వేతనాలు తీసుకుంటున్న 'అణగారిన' అధ్యాప కులు ఎటూ అభద్రతా భావంలో వుంటారు కాబట్టి వారిని తేలిగ్గా లొంగతీసుకోవచ్చు. అయితే అలా నిర్మించబడుతున్న ద్వంద్వ, యథా తథ (కన్‌ఫోర్మిస్టు) నిర్మాణాలు విద్యను మరింతగా నాశనం చేస్తాయి. 
- ప్రభాత్‌ పట్నాయక్‌