తల్లిదండ్రుల, ప్రజల మద్దతుతో ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం

మిత్రమా,

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వరంగములోని పాఠశాలవిద్య తీవ్ర ఇబ్బందుల్లోయున్న విషయము మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల మనగడే ప్రశ్నార్థకమయింది. పాఠశాల విద్యారంగములో తీసుకు రావలసిన మార్పుల గురించి అనేక సందర్భాలలో తెలంగాణ ప్రభుత్వ దృష్టికి తెచ్చాము. రాష్ట్ర ప్రభుత్వము మాత్రము పాఠశాలవిద్య బాగు చేయడానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. పైగా ఈ ప్రభుత్వము కూడ ఉపాధ్యాయుల్ని దోషులుగా చేసే మాటలే మాట్లాడుతుంది. ఈ కాలంలో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వ బడులను నిలబెట్టే కర్తవ్యాన్ని నెరవేర్చుదాం.
విద్యాశాఖ అమలు చేస్తున్న రేషనలైజేషన్‌ విధానాన్ని టిఎస్‌యుటిఎఫ్‌ నిర్ధ్వందంగా ఖండిస్తుంది. ఒక సం||రంలో సెప్టెంబర్‌ - 30 నాడు పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య ప్రకారం టీచర్లను తొలగిస్తామని ఉత్తర్వులు ఇవ్వటం ఆచరణవిరుద్దం. విద్యాహక్కుచట్టం అమలు చేసే క్రమంలో మన రాష్ట్రంలోని పరిస్థితులను గమనంలో పెట్టుకోవాలి. 60 లోపు విద్యార్థులున్న పాఠశాలలకు ఇద్దరు ఉపాధ్యాయులు చాలనేది విద్యాహక్కుచట్టం చెపుతుంది. ఆ ప్రకారమే మన రాష్ట్ర ప్రభుత్వం రేషనలైజేషన్‌ ప్రక్రియ ముగించింది. మన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులుండే బడులే అత్యధికం. ఒకరు సెలవు పెడితే ఒకరే ఉంటారు ఇక ఈ బడుల్లో తల్లిదండ్రులు తమపిల్లల్ని ఎందుకు చేరుస్తారు? తల్లిదండ్రుల నమ్మకాన్ని చూరగొనే విధంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్ని తీర్చిదిద్దే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.
మన రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ప్రాథమిక పాఠశాలల్లో కూడ విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయులను నియమించారు. ఐదు తరగతి గదులున్నవి. 3 సం||ల బాల బాలికలకు ప్రీప్రైమరీ తరగతులు కూడ నిర్వహిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలన్నియు ఇంగ్లీష్‌ మీడియంలోనే నడుపుచున్నారు. తల్లిదండ్రులు కూడ ఇంగ్లీష్‌ మీడియంలోనే చదివించాలనే కోరికతోనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము మాత్రం పై విషయాలనేమి పట్టించుకోకుండా గత ప్రభుత్వాల బాటలోనే రేషనలైజేషన్‌ ప్రక్రియ ముగించింది. దీనివలన ప్రభుత్వ బడులకు కల్గిన లాభమేముంది? ప్రభుత్వ బడులపై ప్రజలకున్న అభిప్రాయము మారుతుందా? లేదనే చెప్పక తప్పదు.
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం తరగతులు మరియు ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించకుండా, ఇతర మార్పుల వలన ఉపయోగమేమిలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ''కెజి నుండి పిజి'' ఉచితవిద్యకు కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తున్నారు. TSUTF ప్రతిపాదించినట్లు కెజినైనా ప్రారంభించమంటే అదీలేదు.
'కెజి నుండి పిజి' కొరకు కొత్తబడులు ప్రారంభించడమంటే, ఉన్నబడులను మూయడమే, ఇపుడు అమలు చేసిన రేషనలైజేషన్‌ ప్రక్రియకూడ బడుల మూతకే పనికొస్తుంది. మండలాన్ని యూనిట్‌గా తీసుకొని ఉన్న బడులలోనే ఇంగ్లీషు మీడియం మరియు ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించునట్లు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావలసియున్నది. ప్రైవేటు చదువుల ఖర్చులు భరించలేక బాధపడుతున్న తల్లిదండ్రులను తట్టిలేపాలి. అపుడు మాత్రమే ఈ ప్రభుత్వం కదిలే అవకాశముంటుంది.
ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా యున్న పరిస్థితులలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాము. మనముందుతరం ఉపాధ్యాయుల పోరాట ఫలితంగా ''బతుకలేనిబడి పంతులు'' గౌరవ ప్రదంగా బతికే ఆర్థికస్థితికి చేరుకున్నాము. ఇపుడు అసలుకే ఎసరొచ్చింది. ప్రభుత్వ బడులుంటాయా? పోతాయా? అనుకుంటున్న సందిగ్ద కాలంలో మనమున్నాము. ప్రభుత్వ బడుల ఆవశ్యకతను ప్రజలు గుర్తించేటట్లు చేయవలసిన కర్తవ్యం ఉన్నత విద్యావంతులుగా మనపై యున్నది. ఈ కర్తవ్య సాధన కొరకు నిరంతరం కృషి చేయాలని కోరుతున్నాము.

అభివందనములతో
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌